Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆటోగ్రాఫ్ లు అంతరించిపోతున్నట్టే!

ఆటోగ్రాఫ్ లు అంతరించిపోతున్నాయా? అవుననే సమాధానమిస్తున్నాయి పరిస్థితులు. గతంలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు, ఏదో ఒక కాగితం, పెన్ను పట్టుకుని వెళ్లి సంతకం తీసుకునేవారు. ఇప్పుడు వాటి అవసరమే లేకుండాపోయింది. డిజిటల్ క్లాస్ రూం, స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తుండడంతో అందరిలోనూ మొబైల్ ఫోన్ దర్శనమిస్తోంది. దానికి అదనపు హంగులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. దీంతో అందరూ సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు తప్పితే ఎవరూ ఆటోగ్రాఫ్ అడగడం లేదు. సెల్ఫీ క్లిక్ మనిపించడం, వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, లైకులు, కామెంట్ల వేటలో పడడం ఇదీ నేటి తరం ఆటోగ్రాఫ్. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సినిమా ప్రమోషన్ కోసం ముంబైలోని ఓ కళాశాలకు వెళ్తే...ఆయనను ఎవరూ ఆటోగ్రాఫ్ అడగలేదట. కేవలం సెల్ఫీలే తీసుకున్నారట. ఆసీస్ క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ అయితే ఆటోగ్రాఫ్ లు అంతరించిపోయాయని ట్వీట్ చేశాడు. పాత తరానికి చెందిన షేన్ వార్న్ కు లెక్కకు మించిన ఆటోగ్రాఫ్ లిచ్చిన చరిత్ర ఉంది. అలాంటి వార్న్ కూడా 'ఉదయం 8 గంటల కంటే ముందు మార్నింగ్ వాక్ కి వెళ్లాను, ఓ అయిదుగురు నాతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక ఆటోగ్రాఫ్ లు అంతరించిపోయినట్టే' అని పేర్కొన్నారు. సెల్ఫీకి ఫుల్ క్రేజ్ తెచ్చిన ప్రధాని మోదీ గురించి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన ప్రతి పనికి ఓ సెల్ఫీని జత చేసి దానిని ప్రజలతో పంచుకోవడం అలవాటు.

More Telugu News